27, అక్టోబర్ 2012, శనివారం

జీవన చక్రం





జీవన చక్రం 

శివుని కుటుంబం చూసిన 
తెలియ వచ్చును జీవ వైవిధ్యం 
శివుని వాహనం వృషభం 
పార్వతి వాహనం సింహం 
గజముఖుని వాహనం మూషికం 
షణ్ముఖిని వాహనం మయూరం 
శివుని కన్తాభరణం  సర్పం  

ఇదే జీవ వైవిధ్యం 
ఇదే సృష్టి చక్రం 

కీటకం ని మింగిన కప్ప 
కప్పని మ్రింగెను పాము 
పామును చీల్చు డేగ 
డేగను వేటాడు విలుకాడు 

ఒక జీవిని ఆధారం చేసుకుని 
మరొక జీవి మనుగడ సాగించును.

ఇదియే జీవన చక్రం 
ఇదియే సృష్టి ధర్మం 

21, అక్టోబర్ 2012, ఆదివారం

ప్రేమ రధం

ప్రేమ రధం

మేఘాల పందిరి  అల్లి
వాన చినుకుల కళ్ళాపి  జల్లి
నింగి  చుక్కలను తెచ్చి 
నేలపై అందంగా అమర్చి
వెన్నెల పిండితో వన్నెల ముగ్గు దిద్ది
హరివిల్లులోని ఏడు రంగులు అద్ది
మధుర భావాల మరు మల్లెలు జల్లి ..

ఓ..ప్రియా! నిరీక్షించాను
నీ రాక కోసం
నీ ప్రేమ రధం కోసం

17, అక్టోబర్ 2012, బుధవారం

మౌన సాక్షిగా


పాత బస్తీలో ..ఆ పేద కొమ్మలకి పూచిన అందాలను చూస్తే
విదేశీ వృద్ద మన్మదులకి నోరూరుతుంది

దుబాయి జాలరి డాలర్  ఎరను వేసి
కన్నె చేపలను బుట్టలో పదవేసుకుంటాడు

డెబ్బయి ఏళ్ళ పులి షాదీ ముసుగు వేసుకుని
పది హేదేళ్ళ  మేకని బాలి తీసుకుంటుంది

అరబ్ షేక్ తుమ్మెద యవ్వనాన్ని జుర్రుకుని
అడ్రస్స్ లేకుండా తుర్రుమంటుంది

దీనంగా సూన్యంలోకి చూస్తూ అమ్మాయిలు
దీనార్ లు లెక్క పెట్టుకుంటూ.అమ్మ-నాన్నలు

కాలం కన్నీరు కారుస్తూ... మౌన సాక్షిగా  

16, అక్టోబర్ 2012, మంగళవారం

ప్రపంచ కవుల దినోత్సవం సందర్భంగా

ప్రపంచ కవుల దినోత్సవం సందర్భంగా .. మా నెల్లూరు..లో జరిగిన కవిసమ్మేళనం .
వారి పరిచయాలతో.. కవిత్వం.



14, అక్టోబర్ 2012, ఆదివారం

కవిత్వం





కవిత్వం

తెల్ల కాగితాలను నలుపు చేయడం కాదు
పదాల గారడీతో బురిడీ  కాదు

నరాల నదిలో ప్రవహించే  భావ ప్రవాహం
గుండె  గేట్లను బద్దలు కొట్టుకుని
వరద పొంగులా పొంగి పొర్లడమే కవిత్వం

కాగితాల  నదిలో ఆక్షర పడవలని
ఒదిలి పెట్టడమే కవిత్వం
సాహితీ ఆకాశంలో అక్షర ప్రశ్నలను
ఎగురవేయడమే కవిత్వం

అక్షరాల విత్తనాలను హృదయ భూమిలో నాటి
కన్నీటి వానలో తడిపి
మానవత్వపు మొలకలను
మొలకేత్తింప జేయడమే కవిత్వం 


12, అక్టోబర్ 2012, శుక్రవారం

అంతర్ముఖి

అంతర్ముఖి
ఆకాశపు అగాధాల లోనూ
సముద్రపు పీట భూములలోనూ
ఏక కాలంలో సంచరించ గలదితడు
కాలం వేసిన కాటులో
పెన వేసే చీకటి తాళ్ళను
తన ఆజ్ఞా చక్రంతో కందించ గలదతడు
ఖగోళ దూరాలనైన
భూగోళ బ్రమనాల నైనా
తన చూపుల చట్రంలో
బంధించ గలదతడు
కాలాన్ని తనలో ఓంపుకొని
భూత కాలంలో ను
భవిష్యత్ కాలంలోనూ అంతర్ముఖి ఐ
వార్త మానం లా ప్రవ హించ గలదతడు !!
{మోపూరు పెంచల నరసింహం ఫై సూర్య షంషుద్దీన్ స్పందన } 

విశ్వ నేత్రం






విశ్వ నేత్రం


మన్నుకు మిన్నుకు మధ్య
నీ లోపలి ప్రపంచములో
విశ్వనేత్రం సంచరిస్తూ ఉంటుంది
నీ జీవన కావ్యంలో
నక్షత్రాల గుట్టల నడుమ
పురుడు పోసుకొనే
నీ వెలుగు పూల భాటలో
కొన్ని  వేల చూపులు
పయనిస్తూ వుంటాయి
నీ సన్నిధిలో ఎన్నో జ్ఞాన నేత్రాలు
వికసిస్తూ వుంటాయి 

{మోపూరు పెంచల నరసింహం పై పల్లపు రాము స్పందన }

11, అక్టోబర్ 2012, గురువారం

ముద్దు ముద్దుగా..





                                                                  ముద్దు ముద్దుగా..


కురులపై  ముద్దు  విరజాజులు  కురిపిస్తూ  
కనురెప్పలపై  ముద్దు  కలల  వాకిళ్ళు  తెరిపిస్తూ  
బుగ్గలపై  ముద్దు  సిగ్గులపూలు  పూయిస్తూ ..
పెదవులపై  ముద్దు ప్రణయ సుధలు గ్రోలుతూ 
తనువులోని అణువణువుకి  ముద్దు తన్మయ రాగాలు పలికిస్తూ..
 
నెచ్చెలి తనువు పై పెదాల కలంతో..చేసే వెచ్చని సంతకం ముద్దు 
శృంగార లోకాల తలుపులు తెరిచే తాళం చెవి ముద్దు.

10, అక్టోబర్ 2012, బుధవారం

స్నేహ సంతకం

స్నేహ సంతకం


ఈ జీవన యానంలో నేను ఒంటరిని కాను 

నీ వెంట పెద్ద సమూహమే కడలి వస్తుంది 
నేను కాలు మోపితే ఎడారి సైతం 
నందన వనమవుతుంది 
నా కరచాలనం సోకితే 
కఠిన పాషాణం సైతం కరిగిపోతుంది 
నేనెప్పుడు నా పెదవుల కొమ్మపై 
చిరునవ్వుల పూవులు పూయిస్తూ ఉంటాను 
సాహిత్య ఆకాశంలో 
కవితల పిట్టలని ఎగురవేస్తుంటాను 
ఆత్మ విశ్వాసం నా గుండె చప్పుడు 
విజయం నా చిరునామా..
ప్రవహించే ప్రేమ నదిని నేను 
స్నేహానికి నిలువెత్తు సంతకం నేను.

9, అక్టోబర్ 2012, మంగళవారం

అక్షర వారధి


అక్షర వారధి  
                                                         

అక్షర బాణాలను తూణీరం లా సర్దుకుని
సూర్యుడికన్నా ముందరే నిలిచి
విశ్వసంచారానికి బయలుదేరతాడు
ప్రతి గుండె తలుపు తట్టి
అక్షర పరిమళాలు విరజిమ్ముతాడు
అపార్ట్ మెంట్ గూళ్ళల్లోకి
నేర్పుగా అక్షర పిట్టలని ఎగురవేస్తాడు
సముద్రమంత సమాచారాన్ని
ఆకాశమంత విజ్ఞానాన్ని
ఇంటింటికి పంచిపెట్టే
అక్షర వారధి అతడు

3, అక్టోబర్ 2012, బుధవారం

మినీ కవితలు



ఎటుచూసినా చీకట్ల ఇక్కట్లు
తీర్చలేనప్పుడు ప్రజల పాట్లు
ఎందుకు వేయాలి మీకు ఓట్లు

* * * * * * *

 ఉమ్మడి వృక్షం కుంచించుకు పోతుంది
పార్టులు పార్టులుగా అపార్టు మెంటుల్లోకి

* * * *  * * *

పీక్కు తినడం మామూలే
బ్రతికిఉన్నప్పుదు లోకులు
చచ్చాక కాకులు
 * * * * * *
 అప్పుడు ఆ ఇంటి రాజు
ఇప్పుడు చూరుకు వేలాడుతున్న బూజు